హైదరాబాద్/అచంపేట: సినీ నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచంపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసి వారి విద్యాభ్యాసానికి అండగా నిలిచారు.
ఇటీవల అచంపేట మండలంలో జరిగిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న స్వయంగా పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ ఇద్దరు సినీ తారల సేవాభావాన్ని ప్రశంసించారు.
తుమ్మన్‌పేట జ్ఞాపకాలతో మొదలైన ప్రయాణం..
గత ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒకటైన ఈ జంట, ఆ తర్వాత విజయ్ తండ్రి జన్మస్థలమైన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట డివిజన్ పరిధిలోని ‘తుమ్మన్‌పేట’ గ్రామాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ తమ నూతన గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం సందర్భంగా.. స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఈ జంట ఒక ప్రకటన చేసింది. ఆ మాటను ఇప్పుడు చేతల్లో చూపిస్తూ ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్ 2026’ జాబితాను అధికారికంగా విడుదల చేశారు.
45 పాఠశాలలు.. 180 మంది విద్యార్థులు!
అచ్చంపేట నియోజకవర్గంలోని దాదాపు 44 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులను ఈ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ చదువులో రాణించి, మొదటి మరియు ద్వితీయ స్థానాల్లో (1st & 2nd Ranks) నిలిచిన 180 మంది విద్యార్థుల విద్యా ఖర్చులను ‘ది దేవరకొండ ఫౌండేషన్’ పూర్తిగా భరించనుంది.ఈ జాబితాలో తుమ్మన్‌పేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి 9వ తరగతి విద్యార్థినులు బి. హేమలత (ఫస్ట్ ర్యాంక్), పి. ప్రణీత (సెకండ్ ర్యాంక్), అలాగే 10వ తరగతి నుండి కె. గణేష్ (ఫస్ట్ ర్యాంక్), బి. అనిల్ (సెకండ్ ర్యాంక్) లు ఉపకార వేతనాలకు ఎంపికైన వారిలో ఉన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ఆత్మీయ’ క్షణాలు
ఇదిలా ఉంటే, విజయ్-రష్మిక తుమ్మన్‌పేట పర్యటనకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఓ బహిరంగ కార్యక్రమంలో రద్దీగా ఉన్న సమయంలో రష్మిక.. విజయ్ నుదుటిపై ఉన్న చెమటను తుడుస్తూ, ఆయన మీసాలను సరిచేస్తూ మురిసిపోయిన విజువల్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. “ప్రపంచంలోనే బెస్ట్ కపుల్”, “ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, శ్రద్ధకు ఇదే నిదర్శనం” అంటూ నెటిజన్లు ఈ జంటపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పెళ్లి చేసుకొని కేవలం తమ సంతోషాన్ని మాత్రమే చూసుకోకుండా, రేపటి తరం భవిష్యత్తుకు వెలుగులు నింపేలా 180 మంది విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులపై అచ్చంపేట గ్రామస్తులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చు: విజయ్ దేవరకొండ భావోద్వేగ ప్రసంగం
ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీకు ఈ స్కాలర్‌షిప్ బహుమతి ఇవ్వడం చాలా చిన్న విషయమే కావచ్చు. కానీ ఇది మాకు చాలా ముఖ్యం. నేను మీ జీవితంలో ఒక భాగంగా ఉండాలనుకుంటున్నాను. నెమ్మదిగా, మా గ్రామం తర్వాత ఈ ఉద్యమం తెలంగాణ అంతటా జరగాలన్నదే నా కల. దీని వెనుక ఉన్న మీ క్రమశిక్షణను, ఏకాగ్రతను నేను అభినందిస్తున్నాను. నేను కానీ, రష్మిక కానీ స్కూల్ రోజుల్లో ఫస్ట్ ర్యాంకర్ లేదా సెకండ్ ర్యాంకర్లం కాదు. కానీ మీకు క్రమశిక్షణ ఉంటే, జీవితంలో ఏదైనా సాధించవచ్చు” అంటూ విద్యార్థుల్లో జోష్ నింపారు.
రష్మిక స్పందన
రష్మిక మందన్న మాట్లాడుతూ, “చదువు జీవితాన్ని మార్చగలిగే గొప్ప ఆయుధం. విద్యార్థులు పెద్ద కలలు కనాలి. కష్టపడి చదివి తమ కుటుంబాలకు, సమాజానికి గర్వకారణం కావాలి. వారి ప్రయాణంలో మేము భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది” అని అన్నారు.
నేను ‘రష్మిక మందన్న దేవరకొండ’గా మీ ముందు నిలబడ్డాను: రష్మిక
ఈ కార్యక్రమం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా రష్మిక, మరియు తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న కొన్ని అందమైన ఫ్యామిలీ ఫోటోలను పంచుకున్నారు. “మరో మంచి రోజు. 45 పాఠశాలల్లోని 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల మొదటి సంవత్సరాన్ని ఇప్పుడే పూర్తి చేశాము. 2027 జూన్‌లో మీ అందరినీ మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్నాము. దీనిని మరింత పెద్దదిగా చేయడానికి కృషి చేస్తాము. మా అందరి నుండి మీకు ప్రేమతో, మీ విజయ్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
త్వరలోనే ‘రణబలి’తో థియేటర్లలోకి..
ఇదిలా ఉంటే, విజయ్ – రష్మికల రీల్ లైఫ్ కెమిస్ట్రీని కూడా వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘గీత గోవిందం’ (2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం ‘రణబలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఒకవైపు సేవా కార్యక్రమాలు, మరోవైపు క్రేజీ సినిమా అప్‌డేట్స్‌తో ఈ క్యూట్ కపుల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
ముఖ్యాంశాలు..
ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్ కార్యక్రమంనాగర్‌కర్నూల్ జిల్లా అచంపేట డివిజన్‌లో నిర్వహణ44 ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థుల ఎంపిక9వ, 10వ తరగతుల టాపర్లైన 180 మందికి స్కాలర్‌షిప్‌లువిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చేతుల మీదుగా పంపిణీగ్రామీణ విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూత
విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తూ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న చేపట్టిన ఈ కార్యక్రమం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
విద్యార్థుల ఉన్నత ఆశయాలకు దేవరకొండ ఫౌండేషన్ దసరా కానుక
ఈ విజయ్ దేవరకొండ రష్మిక స్కాలర్‌షిప్ కేవలం ఈ ఒక్క సంవత్సరానికే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో మరింత మంది అర్హులైన పేద విద్యార్థులకు అందించాలని దేవరకొండ ఫౌండేషన్ ప్రతినిధులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అలాంటి వారికి ఈ స్కాలర్‌షిప్ ఒక గొప్ప వరం లాంటిదని విద్యాశాఖ అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.చదువు అనేది సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకువస్తుందని, ఆ మార్పుకు తమ వంతు అండగా నిలవడం ఎంతో గర్వంగా ఉందని విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు పేర్కొన్నారు. కేవలం సినిమాల ద్వారా వినోదాన్ని పంచడమే కాకుండా, కష్టాల్లో ఉన్న సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఈ జంట ఆలోచనను అభిమానులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. రాబోయే కాలంలో ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి, మరిన్ని పాఠశాలలను దత్తత తీసుకునే యోచనలో కూడా ఫౌండేషన్ ఉన్నట్లు తెలుస్తోంది.





